హైదరాబాద్,వి90న్యూస్, సెప్టెంబర్ 08: శాసనమండలిలో సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మీడియా పాయింట్ వద్ద పోలీసులు అరెస్టు చేయడంతో శాసనమండలి పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సస్పెండ్ అయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మండలి పరిధిలో మీడియా సమావేశానికి అనుమతి లేదని అధికారులు వారించినప్పటికీ, ఎమ్మెల్సీలు అక్కడే మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్సీలను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. కాగా, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేసి బలవంతంగా తరలించడంపై బీఆర్ఎస్ వర్గాలు, ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు కనీసం మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం , పోలీసుల తీరుపై మండిపడ్డారు.

