జమ్మికుంటలో ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై అవగాహన సదస్సు: వ్యాపారులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని అధికారుల పిలుపు
జమ్మికుంట ఏప్రిల్ 30: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్‌లో మెప్మా ఆధ్వర్యంలో గురువారం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ , అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పర్యవేక్షణలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు కరీంనగర్ పీడీ స్వరూప రాణి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిబంధనల మేరకు ప్రతి వ్యాపార సంస్థ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా శాశ్వత గుర్తింపు పొందాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పెట్టుబడి , వార్షిక టర్నోవర్ ఆధారంగా వర్గీకరణ జరుగుతుందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు పొందడం సులభతరమవుతుందని వారు వివరించారు. చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వ నుంచి అందే వివిధ రకాల చేయూత నేరుగా అందుతుందని తెలిపారు. ప్రతి ఎంఎస్ఎంఈ తప్పనిసరిగా ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా లభించే ప్రయోజనాలను వారు ఈ సందర్భంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఎంసీ శ్రీవాణి, డీపీఎం సతీష్, ఇంచార్జి టీఎంసీ మల్లీశ్వరితో పాటు సీఎల్ఆర్పీలు మంజుల, జ్యోతి, ఆర్పీలు , ఓబీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
