హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 15: తెలంగాణలో విద్య, పర్యాటక, వైద్య రంగాల్లో భాగస్వామ్యంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత సహకారం అందించాలని ఆగా ఖాన్ ఫౌండేషన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. భారత పర్యటనలో ఉన్న ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌కు విచ్చేసిన సందర్భంగా సీఎం ఆయనతో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తెలంగాణ వారసత్వ సంపద పునరుద్ధరణలో ఫౌండేషన్ పాత్రను ప్రశంసించారు. ఇటీవల శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణలో అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా వివరించారు.మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, నైట్ ఎకానమీ ప్రణాళికలను సీఎం ప్రతినిధులకు వివరించారు.

మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాల పునరుద్ధరణలో సహాయం అందించాలని కోరారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మిస్తున్నామని, ప్రస్తుత భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ను ఆహ్వానించారు.అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో, 30 వేల ఎకరాల్లో పూర్తిగా నెట్-జీరో విధానంలో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ విశేషాలను సీఎం వివరించగా, ప్రిన్స్ ఆగా ఖాన్ ఎంతో ఆసక్తి కనబరిచారు. సింగపూర్ సంస్థ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లో 15 వేల ఎకరాలను గ్రీన్ జోన్‌గా కేటాయించామని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో హార్వర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు వివరించారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరగా, పర్యాటక రంగంలోనూ సహకారాన్ని కొనసాగించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

