కరీంనగర్ · May 7, 2026

బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్.. గీతా భవన్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్,V90 NEWS, మే 07 : కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల వైఫల్యంపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నగరం నడిబొడ్డున, సిపి కార్యాలయానికి అత్యంత సమీపంలో జువెలరీ షాపులో దోపిడీ జరగడం పోలీసు యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీగా, కేంద్ర హోం మంత్రిగా బాధ్యతల్లో ఉన్న బండి సంజయ్ కనీసం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బండి సంజయ్ నోరు మెదపడం లేదని ఆరోపించారు.కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన విమర్శలను ఖండిస్తూ, చర్చకు సిద్ధమా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. గీతా భవన్ చౌరస్తాలో అభివృద్ధిపై చర్చకు రావాలని, దమ్ముంటే తాను కేటీఆర్‌ను కూడా తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇరిగేషన్, ఐటీ, హోం శాఖ ఏదైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ అభివృద్ధిలో వినోద్ కుమార్, కేటీఆర్ పాత్ర ఉందే తప్ప బండి సంజయ్ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ఖర్చుపై స్పందిస్తూ, 2014లో పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పిన బండి, మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కోట్లు ఎక్కడి నుండి తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, కరీంనగర్‌ను మరో బీహార్‌లా మారుస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అలుగునూరు చౌరస్తాలో న్యాయవాది కాలిద్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను వదిలేసి, బాధితుడిని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కేవలం బీఆర్ఎస్ నేతల మీద నిఘా పెట్టడానికే పరిమితమయ్యాయని, శాంతిభద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు. తక్షణమే కరీంనగర్ సీపీని, సంబంధిత సీఐని పదవుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఆరోపణలపై స్పందిస్తూ, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని, అందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ జిల్లాలో జరుగుతున్న దోపిడీలపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలపై డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor