భూమి కౌలు చిచ్చు: తండ్రిని రోకలిబండతో కొట్టి చంపిన కుమారుడు

0
IMG-20260515-WA0046

ఇల్లందకుంట,వి90 న్యూస్,మే 15: వ్యవసాయ భూమి కౌలు విషయంలో తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ్ముడితో జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన తండ్రిని, కన్నకొడుకే రోకలిబండతో కొట్టి హతమార్చిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని చిన్నకొమటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన చిట్ల సంపత్ (60) కుమారులైన శ్రీనివాస్, శ్రీధర్ మధ్య శుక్రవారం ఉదయం భూమి కౌలు విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన పెద్ద కుమారుడు శ్రీనివాస్, తమ్ముడు శ్రీధర్‌ను రోకలిబండతో కొట్టబోగా అతను తృటిలో తప్పించుకున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న తండ్రి సంపత్ జోక్యం చేసుకుని, గొడవ పడవద్దంటూ శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన శ్రీనివాస్, తండ్రి అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ తన చేతిలో ఉన్న రోకలిబండతో సంపత్ తలపై బలంగా బాదాడు.తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయిన సంపత్‌ను తమ్ముడు శ్రీధర్ వెంటనే జమ్మికుంటలోని శ్రీరామ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని పినాకిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇల్లందకుంట ఎస్ఐ ఎం. క్రాంతి కుమార్ నిందితుడు శ్రీనివాస్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నతండ్రిని కుమారుడే ప్రాణం తీయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed