తెలంగాణ · May 16, 2026

దేవాదుల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్, మే 16: హైదరాబాద్ సచివాలయంలోని నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ పరిధిలోని పలు కీలక నీటి పారుదల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్టేషన్ ఘనపూర్ నుండి నవాబ్ పేట కెనాల్‌పై 4L కాలువ వద్ద షట్టర్ మరియు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఇప్పటికే 49 లక్షల రూపాయలు మంజూరైనందున వర్షాకాలంలోపు ఈ పనులను పూర్తి చేయాలని కోరారు.అశ్వారావుపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా లింగాల ఘనపూర్, గుండాల మండలాల పరిధిలోని 46 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, ఈ ప్రధాన కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయని ఆయన వివరించారు. కేవలం సిల్ట్ రిమూవల్, జంగిల్ క్లియరెన్స్ వంటి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా వాటిని వెంటనే పూర్తి చేయిస్తే రైతులకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. అలాగే దేవాదుల ప్యాకేజీ-6 పనులకు మంజూరు ఇచ్చినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి, ఈ ప్యాకేజీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని, బిల్లులను త్వరితగతిన చెల్లిస్తే పనులు వేగవంతం అవుతాయని సూచించారు. జఫర్ గడ్ ఆన్‌లైన్ రిజర్వాయర్ బలోపేతం కోసం గతంలోనే నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు దేవాదుల ఫేజ్-3 ప్యాకేజీ-8లో భాగంగా బొమ్మకూరు నుండి గండి రామారం ఎడమ కాలువ పనులకు భూసేకరణ పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదని, కాబట్టి ఆ కాంట్రాక్టర్‌ను తొలగించి వేరే వారికి పనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. గండి రామారం ఎత్తిపోతల పథకంలో 3 లిఫ్ట్‌లకు గానూ 104 కోట్లు మంజూరవగా, అందులో లిఫ్ట్-2 పనులు పూర్తయ్యాయని, అయితే లిఫ్ట్-1 పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ చివరి నాటికి లిఫ్ట్-1 పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తే చిల్పూర్, వేలేరు, తరిగొప్పుల వంటి ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్నారు. వీటితో పాటు లిఫ్ట్-1 కాలువ ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపాలనే రైతుల విజ్ఞప్తుల మేరకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor