తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్: జూన్ 2 తర్వాత భారీగా పెరగనున్న ధరలు!
హైదరాబాద్, వి90న్యూస్, మే 21: తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం మందు తాగకుండానే మత్తెక్కించే షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ వేడుకల అనంతరం ఈ పెరిగిన మద్యం ధరలను అమలుల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో విక్రయించే అన్ని రకాల మద్యం బ్రాండ్లపై కనీసం 10 శాతం నుండి 15 శాతం మేర ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్ర ఆదాయాన్ని మరింతగా పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ధరల పెంపునకు అంతర్జాతీయ పరిణామాలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆమాంతం పెరిగాయి. దీని ప్రభావంతో మద్యం సీసాల తయారీకి అత్యంత అవసరమైన ఎల్పీజీ సహజ వాయువుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా గ్లాస్ బాటిళ్లు, రవాణా ఖర్చులు, ప్యాకింగ్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే మద్యం ధరలను సవరించాలని డిస్టిలరీలు, బ్రేవరీస్ కంపెనీలు గత ఏడాది కాలంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. కంపెనీల విజ్ఞప్తులు, రాష్ట్ర ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మేరకు ధరల పెంపునకు మొగ్గు చూపినట్లు సమాచారం.
