జాతీయం · July 28, 2026

తెలంగాణకు 11.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

న్యూఢిల్లీ,వి90న్యూస్,జూలై 28: ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ఎంపీలు, అధికారులతో కలిసి కృషి భవన్‌లో కేంద్ర మంత్రితో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం PMAY-G పథకాన్ని వినియోగించుకోకపోవడంతో రాష్ట్రంలో పదేళ్లుగా పేదలకు ఇళ్లు దక్కలేదని, కేంద్ర ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా చేపట్టిన సర్వేలో 11,56,915 మంది అర్హులను గుర్తించినట్లు వివరించిన ఆయన, సాధ్యమైనంత త్వరగా వీరికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, కూలీలను ఆదుకునేందుకు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పథకంలో అదనపు పనులను చేర్చాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పంటల వైవిధ్యీకరణ, రైతు కూలీల జీవనోపాధి పెంపునకు గాను కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టుపురుగుల పెంపకం షెడ్లు, వెదురు వనాల పెంపకం వంటి పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు.

కొండ వాలు ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాల నిర్మాణం, వరదలు , ఇసుక మేటల వల్ల దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులను కూడా ఈ పథకంలో చేర్చాలని కేంద్ర మంత్రిని పట్టుబట్టారు.ఉపాధి హామీ పథకం (MGNREGS) తరహాలోనే వీబీ జీ రామ్ జీ కింద కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సమయంలో 90 రోజుల పాటు పనిచేసుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే మరికొన్ని పనులకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేష్ షేట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, గడ్డం వంశీ కృష్ణలతో పాటు ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor