తెలంగాణ · May 21, 2026

రాజకీయాలు వేరైనా అభివృద్ధి అందరి బాధ్యత: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతిపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక సమీక్ష

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

మేడ్చల్ మల్కాజ్‌గిరి,వి90 న్యూస్, మే 21: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాగోల్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడి సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కూడా ఉన్నందున ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

కొత్తగా ఏర్పడిన ఈ కార్పొరేషన్‌లో మున్సిపాలిటీలు, గ్రామాలు విలీనం కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ విషయాలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెల్లడించారు. అభివృద్ధి పనులతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కూడా ముఖ్యమేనని, అందుకే కమిషనర్, సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీల ముఖ్య నేతలతో త్వరలోనే ఒక సంపూర్ణ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు.ఈ సమీక్షలో ప్రధానంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం అత్యంత ఆవశ్యకమని, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేవలం జవహర్ నగర్ మాత్రమే కాకుండా మచ్చ బొల్లారంతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న డంపింగ్ యార్డ్‌ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

అధికారులకు అన్ని సమస్యలపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చని, అందుకే ప్రజాప్రతినిధులుగా తామంతా బాధ్యత తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.కార్పొరేషన్ పరిధిలోని చెరువులను పట్టిపీడిస్తున్న గుర్రపుడెక్క సమస్య, మురుగునీరు చేరడం, అంతర్గత డ్రైనేజీ, తాగునీటి ఎద్దడి, వీధి దీపాల కొరతతో పాటు భద్రత పరంగా సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల జరుగుతున్న దొంగతనాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, అభివృద్ధి విషయంలో అందరూ బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ఎంపీ, ఈ కార్పొరేషన్ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సహకారంతో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, వివిధ మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor