కరీంనగర్ · May 21, 2026

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు: ఇద్దరు నిందితుల అరెస్ట్, భారీగా చోరీ సొత్తు స్వాధీనం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వీణవంక,వి90 న్యూస్, మే 21: జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక మరియు వాటి పరిసర ప్రాంతాలలో వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి భారీగా చోరీ సొత్తుతో పాటు నేరాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట కృష్ణ కాలనీకి చెందిన చల్లా శ్రీకాంత్ మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే కుటుంబ అవసరాలు, జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో హాసన్‌పర్తి మండలం భీమారం గ్రామానికి చెందిన పాత నేరస్థుడు మిరియాల భాస్కర్, అలాగే గాజే సాయిచందు అనే వ్యక్తులతో చేతులు కలిపాడు. ఇప్పటికే పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న మిరియాల భాస్కర్ పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఒక పథకం ప్రకారం శ్రీకాంత్, సాయిచందుల ఆధార్ కార్డులను ఉపయోగించి ఐఐఎఫ్ఎల్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, క్యాప్రి గోల్డ్ లోన్ వంటి ఫైనాన్స్ సంస్థల్లో చోరీ చేసిన బంగారాన్ని కుదువ పెట్టి రుణాలు పొందుతూ జల్సాలు చేసేవాడు.

ఈ ముఠా ముఖ్యంగా వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట పరిసర గ్రామాల్లోని ఒంటరి ఇళ్లు, వృద్ధులు మరియు వేసవి కాలంలో ఇళ్ల బయట నిద్రించే వారిని లక్ష్యంగా చేసుకునేవారని పోలీసులు విచారణలో తేల్చారు. నిందితుల్లోని శ్రీకాంత్, సాయిచందులు ముందుగా తమ షైన్ మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, ఆ సమాచారాన్ని భాస్కర్‌కు చేరవేసేవారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అర్ధరాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడేవారు. ఇలా దొంగిలించిన బంగారాన్ని ఫైనాన్స్ సంస్థల్లో పెట్టి వచ్చిన డబ్బును ముగ్గురు సమానంగా పంచుకునేవారు. ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ మోహన్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీధర్, కోమల్, రఘుపతిలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కేసు వివరాలను వెల్లడించిన సందర్భంగా వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగతనాలు, దోపిడీల వంటి నేరాల బాట పడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. యువత తప్పుదోవ పట్టకుండా సరైన మార్గంలో నడవాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు. యువత గనుక చెడు మార్గాలను ఎంచుకుంటే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పట్టుబడిన నిందితుల నుండి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు విచారణను మరింత ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor