కరీంనగర్ · May 21, 2026

జమ్మికుంటలో అర్ధరాత్రి దారుణం: ఎడ్ల వ్యాపారి, ఆటో డ్రైవర్‌పై 11 మంది దుండగుల దాడి, నగదు, బంగారం దోపిడీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంట,వి90 న్యూస్, మే 21: పెద్దపల్లి జిల్లాలో ఎడ్లను కొనుగోలు చేసి ఆటో ట్రాలీలో తిరిగి వస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన ఒక వ్యవసాయదారుడు మరియు ఆటో డ్రైవర్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ విరుచుకుపడి, దౌర్జన్యంగా నగదు, బంగారం దోపిడీ చేసిన ఘోర ఉదంతం జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తూర్పాయగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు నల్లమల్ల ఆంజనేయులు, తన గ్రామానికే చెందిన ఆవుల రాములు అనే డ్రైవర్ ఆటో ట్రాలీని కిరాయికి మాట్లాడుకుని పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి కి వెళ్లారు. అక్కడ వంగ సదానందం అనే వ్యక్తి వద్ద మూడు ఎడ్లను కొనుగోలు చేసి, వాటిని ఆటో ట్రాలీలో ఎక్కించుకుని రాత్రి సమయంలో ఇందిరానగర్ వైపు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో వారి వాహనం జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోగానే, సుమారు 11 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆటోకు అడ్డుగా నిలబడ్డారు.మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, దొంగతనంగా ఎడ్లను తరలిస్తున్నారా అంటూ సదరు దుండగులు ఆంజనేయులు, డ్రైవర్ రాములను బలవంతంగా వాహనంపై నుంచి కిందకు దించారు. వారి మాట వినకుండా ఇద్దరినీ చేతులతో విచక్షణారహితంగా కొట్టుకుంటూ ఎఫ్‌సీఐ గోదాం ముందున్న మేకల మార్కెట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారిని తీవ్రంగా బెదిరిస్తూ ఆంజనేయులు వద్ద ఉన్న 8000 రూపాయల నగదును లాక్కున్నారు. అంతటితో ఆగకుండా ఆయన మొబైల్ ఫోన్ లాక్కుని, పిన్ నెంబర్ చెప్పాలంటూ దాడి చేసి, ఫోన్ పే ద్వారా బలవంతంగా మరో 3000 రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆంజనేయులు కుడి చేతికి ఉన్న అర తులం బంగారు ఉంగరాన్ని కూడా లాక్కున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ రాములపై కూడా దాడికి తెగబడి, అతని వద్ద ఉన్న 1000 రూపాయల నగదుతో పాటు అతని ఫోన్ పే ఖాతా నుండి కూడా మరో 6000 రూపాయలను దౌర్జన్యంగా కొట్టించుకున్నారు.ఇంతటి దోపిడీకి పాల్పడిన తర్వాత కూడా దుండగుల దురాశ చల్లారలేదు. అదనంగా ఇంకో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బాధితులను బెదిరిస్తూ తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో జమ్మికుంట రైల్వే స్టేషన్ వైపు తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదాన్ని పసిగట్టిన ఆంజనేయులు, డ్రైవర్ రాములు గట్టిగా అరుస్తూ కేకలు వేయడంతో, ఆ శబ్దాలు విని స్థానిక జనం అక్కడికి రావడం ప్రారంభించారు. ప్రజలు గుమిగూడటాన్ని గమనించిన నిందితులంతా ఒక్కసారిగా అక్కడి నుండి పరారయ్యారు. దుండగుల చేతిలో గాయపడిన బాధితులు జరిగిన ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను తీవ్రంగా బెదిరించి సుమారు 20 వేల రూపాయల విలువైన అర తులం బంగారు ఉంగరం, అలాగే విడతల వారీగా దోచుకున్న 18 వేల రూపాయల నగదు కలిపి మొత్తం 38 వేల రూపాయల మేర 11 మంది గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor