కరీంనగర్ · May 29, 2026

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి: కేసీఆర్ కిట్ పునరుద్ధరించాలని డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, మే 29: హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించిన ఆయన, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ప్రసవమైన మహిళలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రసవమైన మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న “కేసీఆర్ కిట్” పథకాన్ని అందించేవారని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేయడం సరికాదని విమర్శించారు.

పేద మహిళలకు ఎంతో మేలు చేసే కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. రోగుల పట్ల వైద్యులు గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఎమ్మెల్యే, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు సరిపడా వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor