గిరిజన గురుకులాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: అకాడమిక్ సక్సెస్ మీటింగ్‌లో మంత్రులు పొన్నం, సీతక్క, లక్ష్మణ్
హైదరాబాద్, వి90న్యూస్, మే 30: బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఘనంగా నిర్వహించిన గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల సొసైటీ అకాడమిక్ సక్సెస్ మీటింగ్‌లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లు కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు అందుకున్న విద్యార్థులకు మంత్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇక్కడి విద్యార్థుల విజయాలు మిగిలిన వారికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలని వారు ఆకాంక్షించారు.గిరిజన గురుకులాల్లో చదువుకునే విద్యార్థులను తమ సొంత పిల్లల్లా భావించి, వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల కృషి ఎంతో అభినందనీయమని మంత్రులు కొనియాడారు.

విద్య అనేది కేవలం కొందరికే పరిమితమైన హక్కు కాదని, పట్టుదల ఉంటే గ్రామీణ ప్రాంతాల పిల్లలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కూడా ప్రపంచస్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో నమ్మకాన్ని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విద్య ద్వారానే పేద ప్రజల జీవితాలను మార్చే శక్తి ఉందన్న ముఖ్యమంత్రి గారి బలమైన విజన్‌కు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు పేర్కొన్నారు. సాధారణంగా కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థుల విజయాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంటుందని, అయితే ఇకపై గురుకుల విద్యార్థులు సాధించే విజయాలను కూడా సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్రామస్థాయిలో ఘనంగా సన్మానించి, ప్రోత్సహించే సరికొత్త సంస్కృతి సమాజంలో రావాలని ఈ వేదిక ద్వారా వారు పిలుపునిచ్చారు.

