తెలంగాణ · June 2, 2026

తెలంగాణ ఆకాంక్షల సాధనకై ప్రజల పక్షాన పోరాడుతాం: హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హనుమకొండ,వి90 న్యూస్, జూన్ 02: 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజును పురస్కరించుకొని హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తదనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు.

ఈ వేడుకల్లో భాగంగా మలిదశ ఉద్యమ పోరాటంలో ఉద్యమ నేత కేసీఆర్ తో కలిసి జైలు జీవితం గడిపిన డోకుపర్తి సుబ్బారావు ని వినయ్ భాస్కర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి గౌరవించారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ద్వారా తెలంగాణను సాధించిన మహా నాయకుడు, పోరాట యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ 14 ఏండ్ల పాటు మహాత్మా గాంధీ చూపిన శాంతి మార్గంలో అహింసాయుతంగా ఉద్యమించి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. ఆ తర్వాత 10 ఏండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపారని స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేశారని కొనియాడారు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతూ, ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని 6 గ్యారంటీలు, 420 అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికార పీఠాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గత రెండున్నరేళ్ళుగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయి, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించడానికి, వారి పక్షాన నిలబడి పోరాడటానికి ఈ ఆవిర్భావ దినోత్సవ సాక్షిగా తామంతా ప్రతిజ్ఞ పూనామని వినయ్ భాస్కర్ వెల్లడించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేసి, ప్రజాదరణతో కేసీఆర్ ని తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి తీరుతామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor