కరీంనగర్ · June 4, 2026

వార్డు సభలలో ప్రజల భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీల అభివృద్ధి: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 04: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని స్థానిక అడ్తి దారుల సంఘంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 23, 24, 12, 26 వార్డుల పరిధిలో ఏర్పాటు చేసిన సంయుక్త వార్డు సభకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్యఅతిథిగా విచ్చేశారు.సభను ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో, అదే విధంగా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఇళ్లలో వెలువడే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి మున్సిపల్ చెత్త బండ్లకు మాత్రమే అందజేయాలని కోరారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వేయవద్దని, దీనివల్ల నీరు నిలిచిపోయి రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలని, అమ్మ మనకు జన్మనిస్తే మనం నాటే మొక్కలు మనకు పునర్జన్మను ఇస్తాయని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సభలో ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026 అమలు, “జల్ సంచయ్-జల్ భగీధారి” పథకంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణం, డ్రైన్ల పూడికతీత, రుతుపవనాల సన్నద్ధత కార్యాచరణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు మరియు ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారం వంటి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, పిల్లల ఎదుగుదల మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. విద్యుత్ శాఖ (NPDCL) ఏఈ మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి వార్డు లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా ఎక్కువగా నీరు తాగాలని సూచించారు. ఒకవేళ వడదెబ్బతో ఎవరైనా మరణిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని తెలిపారు.ఈ విస్తృత స్థాయి వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, స్థానిక కౌన్సిలర్లు మొలుగు ప్రణీత, చుంచు రమాదేవి, దిడ్డి కోమల, రాము, గడ్డం దీక్షిత్, వినయ్ లతో పాటు సి.ఎల్.ఆర్.పిలు, ఆర్.పిలు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, విద్యుత్ మరియు మున్సిపల్ సిబ్బంది, వార్డు పెద్దలు , పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor