కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 04: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ప్రకృతి కరుణించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో నరకయాతన అనుభవించిన పట్టణ వాసులకు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం బహుమతిలా మారింది.

మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఇళ్ల నుండి బయటకు రావడానికే భయపడిన జనం, ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.సుమారు గంటన్నర పాటు నాన్‌స్టాప్‌గా కురిసిన ఈ తొలి రుతుపవనాల వర్షం పట్టణాన్ని పూర్తిగా తడిపేసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు వేడి గాలుల స్థానంలో చల్లటి గాలులు వీయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎండల ధాటికి ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులు, పాదచారులు ఈ తొలకరి జల్లులతో ఎంతో ఉపశమనాన్ని పొందారు. ఈ అకాల వర్షం కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ, ఎండల తీవ్రత నుండి శాశ్వత ఉపశమనం లభించడంతో జమ్మికుంట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

