సర్కార్ బడులు తెరిచే రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్: విద్యాశాఖ ముందస్తు ఏర్పాట్లు

0
IMG_20260606_195453

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 06: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 29 వేల ప్రభుత్వ బడులతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24.44 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల కోసం మొత్తం 1,40,92,385 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, పార్ట్-1 సిలబస్ పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ క్రమంలో 95 శాతానికి పైగా పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుకోగా, అందులో 60 శాతానికి పైగా పుస్తకాలు నేరుగా పాఠశాలలకు చేరాయి. మిగిలిన పుస్తకాలను కూడా మరో నాలుగైదు రోజుల్లోగా జిల్లాలకు చేరవేసేలా విద్యాశాఖ అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్‌ను కూడా అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది నుంచి తొలిసారిగా ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్) విద్యార్థులకు సైతం నోట్ బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులందరి కోసం మొత్తం 1.11 కోట్ల నోట్ బుక్స్ అవసరమని గుర్తించగా, ఇప్పటికే అందులో 1.01 కోట్ల నోట్ బుక్స్‌ను అధికారులు విజయవంతంగా జిల్లాలకు తరలించారు. జనగామ, భూపాలపల్లి, హైదరాబాద్, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఇప్పటికే 100 శాతం నోట్ బుక్స్ చేరిపోయాయి. పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో సైతం స్కూల్స్ రీఓపెనింగ్ రోజే విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉండేలా విద్యాశాఖ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed