రక్షించాల్సిన రక్షకుడే భక్షకుడయ్యాడు: హనుమకొండలో మహిళపై ఎస్సై నాలుగేళ్ల దారుణం, కేసు నమోదు
హన్మకొండ,వి90 న్యూస్,జూన్ 14: న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిన ఒక అబల పట్ల ఓ పోలీస్ అధికారి కర్కశంగా, అమానుషంగా ప్రవర్తించాడు. భర్త వేధింపుల నుండి తనను కాపాడాలంటూ వచ్చిన బాధితురాలి కష్టాలను తీర్చాల్సింది పోయి, ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఏకంగా నాలుగేళ్ల పాటు బ్లాక్‌మెయిల్ చేసి తీవ్ర లైంగికదాడికి పాల్పడ్డాడు. నమ్మించి గొంతు కోసిన ఆ ‘ఖాకీ’చకుడి అరాచకాలు భరించలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌పై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.బాధితురాలి ఫిర్యాదు మరియు పోలీసుల కథనం ప్రకారం, హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడి, అది కాస్తా కులాంతర వివాహానికి దారితీసింది. వీరికి ఒక పాప కూడా జన్మించింది. అయితే, కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి తీవ్రమైన గొడవలు ప్రారంభం కావడంతో, సదరు మహిళ 2022 మార్చిలో హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న గోదారి రాజ్‌కుమార్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని నమ్మబలికిన ఎస్సై, తనకు తెలిసిన ఒక న్యాయవాదితో మాట్లాడించి ఆమెకు భర్తతో విడాకులు ఇప్పించాడు. భర్తకు దూరమై ఒంటరిగా ఉన్న ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఎస్సై రాజ్‌కుమార్, ఆమెకు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టిస్తానంటూ ఫోన్లలో మాయమాటలు చెప్పి మరింత దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో ఒకరోజు ఆమెను ఔటర్‌రింగ్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా బెదిరించి, బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన (న్యూడ్) ఫొటోలను తన మొబైల్‌లో రికార్డ్ చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ హనుమకొండలోని పలు లాడ్జిలకు తీసుకువెళ్లి నిరంతరాయంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు. కొంతకాలంగా బాధితురాలు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఎస్సై రాజ్‌కుమార్ తన అసలు స్వరూపాన్ని చూపిస్తూ, పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడమే కాకుండా, తన వద్ద ఉన్న న్యూడ్ ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టి సమాజంలో నీ పరువు తీస్తానంటూ భయభ్రాంతులకు గురిచేసేవాడు. కాగా, వారం రోజుల క్రితం హనుమకొండలో ఆమె పనిచేసే దవాఖాన (హాస్పిటల్) నుంచి ఆమెను ఒక లాడ్జికి తీసుకువెళ్లిన ఎస్సై, అక్కడ మద్యం మత్తులో ఆమెపై మళ్లీ ఘోరానికి ఒడిగట్టాడు. “నువ్వు ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు.. నేనూ పెళ్లి చేసుకోను.. ఇద్దరం ఇలానే కలిసి ఉందాం” అని బెదిరిస్తూ, తీవ్ర ఆగ్రహంతో బీర్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి కొట్టాడు. ఈ మానసిక, శారీరక వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు అక్కడే ఆత్మహత్యకు యత్నించింది. దీంతో భయపడిపోయిన రాజ్‌కుమార్, తక్షణమే ఆమెను తన కారులో తీసుకువచ్చి ఆమె ఇంటి వద్ద దింపేసి పారిపోయాడు.ఈ నరకయాతనను భరించడం తనవల్ల కాదని గ్రహించిన బాధితురాలు రెండు రోజుల క్రితం ధైర్యం చేసి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ నేరుగా ఐజీని కలిసి తనపై జరిగిన అన్యాయాన్ని, ఎస్సై రాజ్‌కుమార్ చేసిన దారుణాలను వివరిస్తూ ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై ఐజీ తీవ్రంగా స్పందించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులను ఆదేశించడంతో, వారు బాధితురాలిని ప్రాథమిక విచారణ కోసం వరంగల్ భరోసా సెంటర్కు పంపించారు. అక్కడ మహిళా ఇన్‌స్పెక్టర్ బాధితురాలి నుంచి పూర్తి స్థాయి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు , భరోసా సెంటర్ నివేదిక మేరకు ఎస్సై రాజ్‌కుమార్‌పై హనుమకొండ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితుడైన ఎస్సై రాజ్‌కుమార్‌కు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. హనుమకొండ నుంచి ఎల్కతుర్తికి బదిలీ అయిన తర్వాత, సుమారు ఏడాదిన్నర క్రితం అవినీతి అక్రమాలకు పాల్పడిన కారణంతో అతను సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. చట్టాన్ని రక్షించి, మహిళలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతాధికారే ఇలాంటి నీచమైన అరాచకానికి ఒడిగట్టడంతో ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

