కరీంనగర్ · June 8, 2026

వార్డు సభలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై విస్తృత చర్చ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 08: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, స్థానిక పత్తిదారుల సంఘం ప్రాంగణంలో 7, 22, 27, 30 వార్డుల ఉమ్మడి వార్డు సభ నిర్వహించబడింది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్( దిలీప్ ) ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో, అదే విధంగా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్లలో వెలువడే తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసి మున్సిపల్ చెత్త బండికి అందించాలని సూచించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లను డ్రైనేజీలలో వేయవద్దని, అలా వేయడం వల్ల నీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, అమ్మ మనకు జన్మనిస్తే మొక్కలు మనకు పునర్జన్మను ఇస్తాయని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సభలో ప్రధానంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026, “జల్ సంచయ్-జల్ భగీధారి” పథకం కింద ప్రతి ఇంట్లోనూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల (ఇంగుడు గుంతల) నిర్మాణం చేపట్టడంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే రుతుపవనాల సన్నద్ధతకు కార్యాచరణ ప్రణాళిక, డ్రైన్ల పూడికతీత, నిరంతర త్రాగునీటి సరఫరా-నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల తక్షణ పరిష్కారం వంటి పలు కీలక అంశాలపై మున్సిపల్ చైర్మన్ అధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, పిల్లల శారీరక ఎదుగుదల , గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు.

ఎన్పీడీసీఎల్ ఏఈ మాట్లాడుతూ, విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఆయా వార్డుల లైన్‌మెన్లు, జేఎల్‌ఎంలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య శాఖ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రస్తుత ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీరు త్రాగాలని సూచించారు. ఒకవేళ ఎండదెబ్బ (వడదెబ్బ) కారణంగా ఎవరైనా మరణించినట్లయితే, నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, చందా రాజు, ఫిరోజ్, మంద రాధా, మంద రాజేష్, మున్సిపల్ ఏఈ వికాస్, వార్డు ఆఫీసర్లు, సీఎల్‌ఆర్‌పీలు, ఆర్పీలు, విద్యుత్ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వార్డుల పెద్దలు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor