తెలంగాణ · June 8, 2026

ధరలను అదుపు చేయడంలో పాలకులు విఫలం: ఎంసిపిఐ(యు) కలెక్టరేట్ ధర్నాలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్ ,వి90 న్యూస్,జూన్ 08: విపరీతంగా పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టాన్ని తీసుకురాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏకశిలా పార్క్ నుండి వరంగల్ కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశంలో రైతులు, కార్మికులు, ప్రజలు, ఆదివాసీలు తీవ్రమైన సామాజిక, ఆర్థిక, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల ధరలు, పెరుగుతున్న ధనిక పేదల అంతరాలు, పారిశ్రామిక సంస్థల మూత మరియు వ్యవసాయ సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై భారం మోపుతూ చమురు కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే పెట్రోల్, డీజిల్, సహజవాయువు , ఎరువుల ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రజలకు హాని కలిగించే అమెరికా వాణిజ్య ఒప్పందం నుండి వ్యవసాయ, పాడి ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలను మినహాయించాలని కోరారు.డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించి, దానికి చట్టబద్ధమైన హోదా కల్పించాలని రమేష్ డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం నిర్ణయించిన ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారిపై కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులను దోచుకునే విధంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత చట్టాలను యధావిధిగా అమలు చేయాలని, మహిళలు, పసిపిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టి దోషులను రాజకీయాలకు అతీతంగా శిక్షించాలని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ కుంభకోణాలపై సంబంధిత కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పాత చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలను, క్యూబా, ఇరాన్, వెనిజులాలపై దాడుల బెదిరింపులను దేశవ్యాప్తంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యశారద కి అందజేశారు.ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ కేంద్ర నాయకులు మోర్తాల చందర్ రావు, గోనె కుమారస్వామి, సింగతి సాంబయ్య, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి మాలోతు సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కనకం సంధ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, జిల్లా నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్, బాసిపాక రమేష్, అప్పనపురి నర్సయ్య, మాలి ప్రభాకర్, బల్సుకురి నర్సయ్య, ఐతం నాగేష్, బిట్ల సమ్మయ్య, పరిమళ, గోవర్ధన్, రాజు, జట్టి రాజు, ఉడుత గణేష్ లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor