కరీంనగర్ · June 8, 2026

మాస్టర్స్ స్వామి వివేకానంద పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి: జిల్లా కలెక్టర్‌కు యూత్ కాంగ్రెస్ నేత పర్లపెల్లి నాగరాజు వినతి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, జూన్ 08: జమ్మికుంట పట్టణంలోని మాస్టర్స్ స్వామి వివేకానంద పాఠశాలలో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాస్పద ఘటనలు, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి ఆ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సదరు పాఠశాలలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితుల దృష్ట్యా రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యార్థులకు కొత్తగా సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఈ పాఠశాలలో సుమారు వంద మంది వరకు పేద విద్యార్థులు చదువుకుంటున్నారని నాగరాజు వివరించారు. అయితే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన పుస్తకాలు, బ్యాగులు ఇతర కనీస వసతులను పాఠశాల యాజమాన్యం సక్రమంగా అందించడం లేదని ఆరోపించారు. వీటికి బదులుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా భారీగా డబ్బులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు గతంలోనూ వివాదాస్పదంగా మారిందని నాగరాజు గుర్తుచేశారు. గత ఏడాది నవంబర్ 4వ తేదీన పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు యాజమాన్యం వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ దారుణ ఘటనపై సామాజిక సంక్షేమ, బాలల సంక్షేమ శాఖల అధికారులు విచారణ కూడా జరిపారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒక బాలికపై పాఠశాల యాజమాన్యానికి చెందిన వ్యక్తులే లైంగిక వేధింపులకు తెగబడ్డారని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు సైతం నమోదైన విషయాన్ని ఆయన ఫిర్యాదులో గట్టిగా ప్రస్తావించారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు, క్రిమినల్ కేసులు , వరుస అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సదరు పాఠశాల యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని నాగరాజు విమర్శించారు. అక్కడ చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భద్రత, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించి పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సీట్లను రద్దు చేయాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor