కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ‘జయశంకర్ బడిబాట’ ఇంటింటి ప్రచారం: ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 09: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలకనుగుణంగా జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరంగా వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ తరగతుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని, ఒక ఆయాను కూడా నియమిస్తున్నట్లు తెలియజేస్తూ, దీనిపై తల్లిదండ్రులతో ఒక సన్నాహక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలోని బడి ఈడు గల పిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దబ్బెట రవీందర్ , ఉపాధ్యాయ బృందం కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గుడిమిల్ల బలరాం, సంగసాని కుమారి, సీఆర్పీ గుర్రప్ప, రేఖ, కవితలతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

