హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం: జూన్ 15 లోగా ‘ఈ-సాక్ష్య’లో వివరాల నమోదు పూర్తి కావాలని ఆదేశం
కరీంనగర్ /హుజురాబాద్, వి90 న్యూస్, జూన్ 09: వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి విచ్చేసిన సీపీకి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించగా, ఆయన ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ, గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు పోలీసింగ్‌లో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రివెంటివ్ పోలీసింగ్, సీసీటీఎన్ఎస్ 2.0, ‘ఈ-సాక్ష్య’ యాప్‌లలో పాత, కొత్త కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15 లోగా తప్పనిసరిగా పొందుపరచాలని ఆదేశించారు.

గత నెలలో కరీంనగర్ పీఎంజే నగల షోరూంలో జరిగిన దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని, నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేస్తూ భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు.

నేరాల నియంత్రణలో భాగంగా నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల వలస కార్మికుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను అన్ని పోలీస్ స్టేషన్లలో మైంటైన్ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. బేసిక్ పోలీసింగ్‌లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జీలు, వాహన తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకై నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ జాగిలాల సహాయంతో తనిఖీలు చేస్తున్నామని, డ్రగ్ టెస్ట్ కిట్‌ల ద్వారా అనుమానితులకు పరీక్షలు నిర్వహించి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మహిళల రక్షణ కోసం ‘షీ లీడ్స్’, ‘స్నేహిత’ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామని, నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. ఈ తనిఖీల్లో హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ పట్ల సీపీ సంతోషం వ్యక్తం చేస్తూ “భేష్” అని అభినందించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, ఆవుల తిరుపతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

