కరీంనగర్ · June 9, 2026

ధర్మారం అంజన టౌన్‌షిప్ ప్లాట్ రిజిస్ట్రేషన్‌లో భారీ అవకతవకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట, వి90 న్యూస్, జూన్ 09: ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లేఅవుట్‌కు అసలు సంబంధమే లేని సర్వే నెంబరును తప్పుడు పద్ధతిలో జతపరిచి, తద్వారా బ్యాంక్ లోన్ రాకుండా అడ్డుకుంటూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్న నలుగురు వ్యక్తులపై జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే దుర్గాప్రసాద్ (46) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమ్మికుంటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబ అవసరాల నిమిత్తం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం శివారులో గల అంజన టౌన్‌షిప్‌లో 59వ నెంబర్ గల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్‌ను జొన్నతుల కోనారెడ్డి, రాఘవరెడ్డి, గర్రెపల్లి అరుణ్ కుమార్, టి. రాజేశ్వరరావు అనే నలుగురు వ్యక్తులకు సంబంధించిన మదర్ డాక్యుమెంట్ నెంబర్ 3778/2024 ఆధారంగా ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అయితే సదరు రియల్ ఎస్టేట్ లేఅవుట్‌కు సంబంధించిన అసలు అనుమతులలో సర్వే నెంబర్లు 94, 95, 100 మాత్రమే ఉన్నాయి. కానీ విక్రయదారులు ఉద్దేశపూర్వకంగానో లేదా నిర్లక్ష్యంగానో ఆ లేఅవుట్‌తో ఎలాంటి సంబంధం లేని సర్వే నెంబరు 103ను కూడా డాక్యుమెంట్‌లో జతపరిచి బాధితుడికి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బాధితుడు దుర్గాప్రసాద్ సదరు ప్లాట్‌పై బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఉన్నతాధికారులు లేఅవుట్ ప్రొసీడింగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో సర్వే నెంబరు 103 లేకపోవడం, కానీ బాధితుడి డాక్యుమెంట్‌లో మాత్రం ఆ నెంబరు స్పష్టంగా నమోదై ఉండటాన్ని గుర్తించి సాంకేతిక కారణాల వల్ల ఆయన లోన్ దరఖాస్తును పూర్తిగా తిరస్కరించారు.
దీంతో తీవ్ర ఇబ్బందుల్లో పడిన బాధితుడు ప్లాట్ అమ్మిన కోనారెడ్డి, రాఘవరెడ్డి, అరుణ్ కుమార్, రాజేశ్వరరావులను కలిసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో జరిగిన తప్పును Rectify (సవరణ) చేయాలని బ్రతిమిలాడారు. దానికి వారు సానుకూలంగా స్పందించకుండా, సవరణ డాక్యుమెంట్ చేయకుండా రోజురోజుకూ కాలయాపన చేస్తూ బాధితుడిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తూ వస్తున్నారు. తాము మోసపోయామని గ్రహించిన దుర్గాప్రసాద్ చివరకు న్యాయం కోసం జమ్మికుంట పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సదరు నలుగురు వ్యక్తులపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor