తెలంగాణ · June 9, 2026

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 09:మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన సంస్కృతిలో ఆడబిడ్డలను లక్ష్మీదేవితో కొలుస్తామని, భూమిని భూమాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి వీరనారీమణులు తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. ఆడబిడ్డలకు ఓటు హక్కు కల్పించి అధికారం ఇచ్చింది నెహ్రూ కాగా, రాష్ట్రపతిగా , మంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మొదటి ఐదేళ్లు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదని, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా తమ అధ్యక్షురాలిగా ఏనాడూ మహిళను నియమించలేదని విమర్శించారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు 2013 లోనే సోనియా గాంధీ పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని, రాబోయే రోజుల్లో మహిళలు దేశ, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టగా, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మంజూరు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే కొందరు కడుపు నిండా విషం నింపుకుని, దాన్ని రద్దు చేయాలని రోడ్డెక్కారని మండిపడ్డారు. అయినప్పటికీ తాము వెనక్కి తగ్గకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తున్నామని, దీని ద్వారా ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించామని, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు అదానీతో పోటీ పడేలా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు.

కార్పొరేట్ ఆఫీసులతో పోటీ పడేలా ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని, మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు హైటెక్ సిటీలో 106 స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికలపైకి కూడా తీసుకెళ్తున్నామని వివరించారు. వాతావరణ శాఖ ఎల్ నినో ఉందని చెప్పినప్పటికీ, తాము 553 బస్సులను ప్రారంభించగానే వరుణదేవుడు కరుణించాడని గుర్తుచేశారు.తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతిలోనే ఉందని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే 2034 వరకు ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తామని, భవిష్యత్తులో వెయ్యి కాదు ఏకంగా 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయంలో అన్ని రకాల పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని మహిళలకు సూచించారు. ఈ మహోత్తర వేదికపై మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక సమాఖ్య (SHG), మండల మహిళా సమాఖ్యలకు (MMS) సీఎం పలు చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా మండల మహిళా సమాఖ్యలు నిధులు సమకూర్చి, టీజీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహిస్తున్న 553 బస్సుల అద్దె చార్జీల నిమిత్తం (ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 చొప్పున) రూ.20.34 కోట్ల చెక్కును విడుదల చేశారు. దీనితో పాటు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.500 కోట్ల చెక్కును, అలాగే రాష్ట్రంలోని మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా ఆదా చేసిన రూ.10,700 కోట్ల భారీ నిధుల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు అందజేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor