తెలంగాణ · June 10, 2026

జూన్ 21న ఇందిరాపార్కులో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం: కరపత్రాన్ని విడుదల చేసిన మాజీ చైర్మన్ పిడమర్తి రవి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి/షాద్‌నగర్, వి90 న్యూస్, జూన్ 10: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులంతా సంఘటితమై, తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. జూన్ 21న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం’ పోస్టర్, కరపత్రాన్ని షాద్‌నగర్ బ్లాక్ ఆఫీస్ ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద స్థానిక ఉద్యమకారులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి. వెంకట్ రాంరెడ్డి, కౌన్సిలర్ దిలీప్ కుమార్, విద్యార్థి నేత జాంగారి రవి తదితరులు పిడమర్తి రవిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ,

శతాబ్ద కాలంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని, అమరులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కలేదని, కొద్దిమందికి చిన్న పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పనిచేసిన విద్యార్థులు, కార్మికులకు తగిన ఫలాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉద్యమకారులను గుర్తించేందుకు కె. కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేయడం హర్షణీయమన్నారు. అయితే, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వేలాది మందిపై పోలీస్ కేసులు నమోదు కాకపోవడం వల్ల, తమకు ప్రభుత్వ ఫలాలు దక్కవేమోననే అపోహలు ఉద్యమకారుల్లో నెలకొన్నాయని, అందుకే అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ప్రత్యేక గుర్తింపు కార్డులతో పాటు నెలకు పింఛన్ మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అప్పటి విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా ఉన్న తన ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించామని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం నాడే తన మంత్రి పదవిని త్యాగం చేసి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. జూన్ 21న ఇందిరాపార్కులో జరిగే ఈ మహా సమ్మేళనానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని, ప్రజా ప్రభుత్వంలో తమకు దక్కాల్సిన గౌరవాన్ని, సంక్షేమ పథకాలను సాధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మాంగులాల్ నాయక్, ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మేకల వెంకటేష్, రవి కుమార్ గౌడ్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెళ్ళి సురేష్, రహీమ్, నాయకులు కుడుముల మల్లేష్, ప్రసాద్, సిందం విటలయ్య, శేఖర్ గౌడ్, సింగపాగ శివ, సామెల్, రామకృష్ణ, చింటు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor