ఆంధ్ర ప్రదేశ్ · June 11, 2026

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల అభివృద్ధి: ‘బడి పిలుస్తోంది’లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట/వాడపాలెం,వి90 న్యూస్, జూన్ 11: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకుంటున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధీమా వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో వాడపాలెంలో నిర్వహించిన ‘బడి పిలుస్తోంది’ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన స్వగృహం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు స్వయంగా వెళ్లారు.

ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన విద్యా ప్రమాణాలను, ప్రాధాన్యతను వారికి క్షుణ్ణంగా వివరించిన ఆయన, తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే ఒక విద్యార్థిని ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే, స్వయంగా ఆమె అడ్మిషన్ ఫామ్‌ను పూర్తి చేసి ప్రభుత్వ బడిలో చేర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఉచితంగా కల్పిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’, నాణ్యమైన పుస్తకాలు, దుస్తులతో కూడిన ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్’, అలాగే పౌష్టికాహారాన్ని అందించే ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ వంటి ప్రతిష్టాత్మక సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను పెంచడంతో పాటు, బడుల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులపై తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.


రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేలా మరిన్ని మౌలిక వసతులు కల్పించి, మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యం కలిగిన వారని, అందుకే ప్రభుత్వ బడుల్లోనే అత్యుత్తమ బోధన అందుతుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వాడపాలెం హైస్కూల్ నుండి అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను ఎమ్మెల్యే సత్యానందరావు ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సత్కరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor