సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత, భారీగా అరెస్టులు
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టులు గురువారం చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపానికి పూలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం, అక్కడ నుంచి సచివాలయం ముట్టడికి భారీ ర్యాలీగా బయలుదేరారు. అయితే, అలర్ట్ అయిన పోలీసులు జర్నలిస్టులను గన్ పార్క్ వద్దే బారికేడ్లతో అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను, జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పంజాగుట్ట, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా పాలకులు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకుండా తీవ్ర వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా జర్నలిస్టులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) బిల్లులను నిలిపివేయడంతో చిన్న, మధ్య తరహా పత్రికలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని, గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.దీనితో పాటు ఆర్ఎన్నై, పీఆర్జీఐ నిబంధనల ప్రకారం ఉన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచిత విద్య, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. ఉచిత బీమా సౌకర్యం, 60 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు పెన్షన్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాలని నినదించారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రజా ప్రభుత్వానికి కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన, ముట్టడి కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయ్ కుమార్, యాదగిరి, కుడితాడు బాపురావు, తన్నీరు శ్రీనివాస్, చిర్రా శ్రీనివాస్, దామెర జగదీశ్వర్ గుప్తా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవి కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్, గండీటి నర్సింహా, గోపాల్, మధు, పాల్వాయి జానయ్య, ముషం హరిప్రసాద్, జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, దూమర్ల భాస్కర్, అశోక్ కుమార్ గౌడ్, మల్లేశం, గడ్డమీది అశోక్ తదితర వందలాది మంది జర్నలిస్టు నేతలు పాల్గొన్నారు.

