తెలంగాణ డిజిటల్ కేబినెట్: ఇకపై పేపర్ లెస్ విధానంలోనే రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలు
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 18: రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను పూర్తిగా పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ సరికొత్త డిజిటల్ కేబినెట్ విధానానికి శ్రీకారం చుడుతూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సమావేశంలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రిమండలిలోని మంత్రులందరికీ ప్రత్యేకంగా ట్యాబ్‌లను అందజేశారు. మంత్రిమండలి సమావేశాల నిర్వహణకు సంబంధించిన పూర్తి డిజిటల్ విధానాన్ని ఈ ట్యాబ్‌ల ద్వారా సమావేశంలోనే ప్రదర్శించి, దాని పనితీరును కూలంకషంగా పరిశీలించారు.

ఈ నూతన సాంకేతిక మార్పుతో ఇకపై జరిగే మంత్రిమండలి సమావేశాల ఎజెండా, దానికి సంబంధించిన పూర్తి నోట్స్ , ఇతర కీలక సమాచారమంతా ‘ఈ-బుక్’ రూపంలోనే మంత్రులకు అందుబాటులో ఉండనుంది. పరిపాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు, కాగితం వాడకాన్ని తగ్గించి పర్యావరణహితంగా సభలను నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డిజిటల్ అడుగులు వేసింది.

