నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్: పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 18: జూన్ 21వ తేదీన నీట్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.ఈ మేరకు విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపిస్తే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష రాసే విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ప్రయాణం సాఫీగా సాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

