తెలంగాణ · June 18, 2026

మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 18: తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, వరదల దుస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదన్న దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో మొక్కను నాటి ఆయన ‘వనమహోత్సవం – 2026’ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ. 17.84 కోట్ల వ్యయంతో చేపట్టే పనులతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రకృతి సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ కోసమై రూ. 35.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం తదితర 11 జిల్లాల్లో రూ. 17.66 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అర్బన్ పార్కులు, జూ ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎవరేమనుకున్నా వెనక్కి తగ్గేదే లేదని, గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తనదేనని ప్రకటించారు. సబర్మతీ, గంగా, యమునా నదుల రివర్‌ఫ్రంట్ల కన్నా అద్భుతంగా మూసీని తీర్చిదిద్దుతామని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో కేవలం ఒక వైపే అభివృద్ధి జరిగిందని, కూతవేటు దూరంలో ఉన్న ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడ వంటి ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని మండిపడ్డారు.

ఈ ప్రాంతాల అభివృద్ధి కోసమే రూ. 2,400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నామని తెలిపారు. కబ్జాదారుల బారి నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడి రక్షించుకున్న గుర్రంగూడ స్థలంలో వంద ఎకరాలను నేషనల్ పార్క్ కోసం కేటాయించామని, ఎల్బీ నగర్ ప్రాంతంలో మొత్తం 424 ఎకరాల్లో అంతర్జాతీయ పార్క్‌ను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే వర్షాలు వచ్చినప్పుడు బస్తీలు మునిగిపోతున్నాయని, ప్రజలకు ఈ కష్టాలు తప్పించడానికే కబ్జాదారుల కోరలు పీకేందుకు ‘హైడ్రా’ను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొద్దిమంది స్వార్థం కోసం వేలాది కుటుంబాలను ముంచే పరిస్థితిని ప్రభుత్వం ఉపేక్షించబోదని, పార్కులు, చెరువులను కబ్జా చేస్తే హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. గతంలో సీరీస్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత ప్రజలు పడిన ఇబ్బందులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor