ఆరోగ్యం · June 19, 2026

జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలి: సీపీఎం డిమాండ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి, రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మికుంట సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా వార్డుల్లోని పేషంట్లతో నేరుగా మాట్లాడి, ఆసుపత్రిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, సుమారు 300కు పైగా గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉన్న జమ్మికుంట పట్టణ ఆసుపత్రిని దశాబ్దాల కాలం నుండి కేవలం 30 పడకలకే పరిమితం చేశారని మండిపడ్డారు.

రెండు నెలల క్రితం దీనిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. తక్షణమే ఈ ఆసుపత్రిని వంద పడకలుగా మార్చి, అందుకు తగినట్లుగా డాక్టర్లను, సిబ్బందిని, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు.ఆసుపత్రిలో కనీస సౌకర్యాల లేమిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న ప్రమాదాలు జరిగినా కనీసం ఎక్స్రే తీసే సౌకర్యం లేకపోవడంతో, పేద రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పేషంట్ల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలన్నారు.

అలాగే, జమ్మికుంటకు డయాలసిస్ సెంటర్ ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని, ప్రభుత్వం కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం కావడంతో డయాలసిస్ రోగులు ఇప్పటికీ హనుమకొండ, కరీంనగర్ ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోందని ఆరోపించారు.ఆసుపత్రి సిబ్బంది సమస్యలపై స్పందిస్తూ, ఇక్కడ పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, వారికి నెలకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో తీవ్రంగా ఉన్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేసి రోగుల ఇబ్బందులను తీర్చాలన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది దూర ప్రాంతాల నుండి కాకుండా జమ్మికుంటలోనే నివాసం ఉండేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరారు. ఇదే సమయంలో విధుల్లో సమయపాలన పాటించని ఎల్‌డీసీ, యూడీసీ, ఫార్మసిస్టులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor