కరీంనగర్ · June 19, 2026

మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి: బీఎస్పీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జమ్మికుంటలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు నాయకుల మద్దతు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 19: జమ్మికుంట పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు అంబాల ప్రభు, మొగులయ్య సందర్శించి కార్మికులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అహర్నిశలు పట్టణ పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్లు అత్యంత న్యాయమైనవని, ప్రభుత్వం స్పందించి వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మున్సిపాలిటీలలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్ పే కార్మికులను తక్షణమే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రెండో పీఆర్‌సీని ప్రకటించి కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ. 26 వేలుగా నిర్ణయించాలని, కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని కోరారు.కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 30 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు ప్రాధాన్యత క్రమంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు లేదా ఇంటి స్థలాలు కేటాయించి ప్రభుత్వం వారి సొంతింటి కలను నిజం చేయాలన్నారు. చట్ట ప్రకారం కార్మికులకు రోజుకు 8 గంటల పని విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి సంవత్సరం శానిటేషన్, వాటర్ వర్క్స్, హరితహారం విభాగాల కార్మికులతో పాటు ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లకు అవసరమైన రక్షణ పరికరాలు, దుస్తులు అందించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్లు, జవాన్లకు ఇతర విభాగాల ఉద్యోగులతో సమానంగా డ్రైవర్స్ కేటగిరీ వేతనాలు వర్తింపజేయాలని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ పోరాటంలో బీఎస్పీ ఎల్లప్పుడూ ముందుంటుందని, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో కొలుగూరి తిరుపతి, శ్రీనివాస్, కోమల రవి, నరేష్, ఎం. కుమార్, సుజాత, శృతి, రాసపల్లి సంజీవ్, మరేపల్లి ప్రశాంత్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor