జమ్మికుంటలో వినూత్న కార్యక్రమం: చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 27: జమ్మికుంట పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు మున్సిపల్ యంత్రాంగం వినూత్న చర్యలు చేపట్టింది. పట్టణ పరిధిలోని పలు వార్డులలో ఖాళీ స్థలాలు, ప్రధాన కూడళ్లలో కొందరు ఇష్టారాజ్యంగా చెత్తాచెదారం వేస్తున్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే 30వ వార్డులోని పీఏసీఎస్ (PACS) పక్కన నిరంతరం చెత్త వేసే ప్రదేశాన్ని శుభ్రం చేయించి, అక్కడ స్థానిక మహిళలతో కలిసి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) స్వయంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణంలో చెత్త సేకరణ కోసం ప్రతి వార్డుకు సూపర్ క్యారీ వాహనాలను, ప్రధాన రహదారుల కోసం ట్రాక్టర్లను నిరంతరం నడుపుతున్నప్పటికీ, కొంతమంది ఇంకా రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా కేవలం మున్సిపల్ వాహనాలకు మాత్రమే తడి, పొడి చెత్తను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎలాంటి సీజనల్ వ్యాధులు, అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని ఆయన ప్రజలకు హితవు పలికారు. పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సామాజిక కార్యక్రమంలో పల్లా నారాయణ, కటకం సంపత్, లెంకలపల్లి శరత్ లతో పాటు స్థానిక వార్డు మహిళలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

