కరీంనగర్ · June 28, 2026

తహశీల్దార్ భవన నిధుల మంజూరు: ముఖ్యమంత్రి, మంత్రులు, వొడితల ప్రణవ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూన్ 28: ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు గాను మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నియోజకవర్గాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ పునఃనిర్మాణానికి నిజమైన కృషి జరుగుతోందని అన్నారు. గతంలో జిల్లాల, మండలాల పునర్విభజన చేసినప్పటికీ, నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు కనీసం నిధులు కూడా మంజూరు చేయించలేకపోయారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్సీ, విప్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఈ రోడ్డు గుండా పలుమార్లు ప్రయాణించినా ఒక్కసారి కూడా భవన నిర్మాణ నిధుల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని నిధుల మంజూరుకు జీవో జారీ చేస్తే, ఆ క్రెడిట్ తనదేనంటూ కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నిరంతరం మంత్రుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, ప్రత్యేకంగా చర్చలు జరపడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని వారు స్పష్టం చేశారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రణవ్ బాబు నాయకత్వంలో నియోజకవర్గ ప్రగతికి తమ వంతు కృషిని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor