కరీంనగర్ · June 29, 2026

మడిపెల్లి హత్య కేసును ఛేదించిన పోలీసులు: నిందితుడు మహేష్ అరెస్ట్, ఆయుధాలు స్వాధీనం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూన్ 29: ఇటీవల మడిపెల్లిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (40) అనే నిందితుడిని పోలీసులు సోమవారం ఉదయం అతని నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని పూర్తిగా అంగీకరించడమే కాకుండా, హత్యకు దారితీసిన సంచలన వివరాలను వెల్లడించాడు.తన వ్యవసాయ భూమి సమీపంలో కౌలుకు ఉండే ఒక వివాహిత మహిళతో ఏర్పడిన పరిచయం, ఆపై సదరు మహిళపై మృతుడు పైతరి మొగిలి అత్యాచార యత్నానికి పాల్పడటం ఈ వివాదానికి కారణమయ్యాయని నిందితుడు తెలిపాడు. ఆ సమయంలో తానే బాధితురాలికి అండగా నిలిచి పోలీసులకు ఫిర్యాదు చేయించానని, ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి మొగిలి తనను నిరంతరం అవమానిస్తూ, రెచ్చగొట్టేలా ప్రవర్తించేవాడని పేర్కొన్నాడు. ఈ గొడవల వల్ల రెండు కుటుంబాల మధ్య తీవ్ర విభేదాలు రావడంతో, వాటన్నింటికీ మొగిలియే కారణమనే కక్షతో అతడిని హతమార్చాలని మహేష్ పథకం రచించాడు.ఈ క్రమంలోనే జూన్ 27న పీర్ల పండుగ కోసం గ్రామానికి వచ్చిన మృతుడిని నిందితుడు గమనించాడు. హత్యకు ముందే యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు, ఆయుధాల తయారీ విధానాలపై శోధించిన మహేష్, పక్కా ప్లాన్‌తో ఇంటి నుంచి ఇనుప రాడ్ తీసుకుని అంకుశాపూర్ వెళ్లే దారిలో మద్యం సేవిస్తూ మొగిలి కోసం వేచి చూశాడు. రాత్రి 11:45 గంటల ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తున్న మొగిలిని వెనుక నుంచి ఇనుప రాడ్‌తో తలపై బలంగా బాదాడు. కిందపడిపోయిన బాధితుడి తల, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం ఆయుధాన్ని వ్యవసాయ బావి సమీపంలో పడేసి, ఇంటికి వెళ్లి రక్తపు మరకల దుస్తులను మార్చుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హత్యకు వాడిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న లుంగీ, టీ-షర్ట్, యూట్యూబ్ సెర్చ్ చేసిన మోటరోలా మొబైల్ ఫోన్, హీరో ప్యాషన్ ప్రో మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి వివరాలను వెల్లడించిన పోలీసులు, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ప్రకటించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor