తెలంగాణ · June 29, 2026

రంగాపూర్ వద్ద ఘోర ప్రమాదం: అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా, 15 మందికి గాయాలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వనపర్తి,వి90 న్యూస్,జూన్ 29: 44వ నంబర్ జాతీయ రహదారిపై పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం నుండి వనపర్తికి 61 మంది ప్రయాణికులతో వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS32Z0015) అకస్మాత్తుగా అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీశారు. క్షతగాత్రులను తక్షణమే పెబ్బేరు, వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించగా, నిశితంగా ఉన్న మరికొందరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే వనపర్తి డీఎస్పీ గిరిధర్, సీఐ రాంబాబు, ఎస్‌ఐ వెంకటేష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ప్రమాదానికి గల కారణాలపై డీఎస్పీ ఆరా తీశారు. బస్సు కుడివైపు బ్రేక్ జామ్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ ప్రాథమికంగా తెలిపినప్పటికీ, డ్రైవర్ అజాగ్రత్త లేదా నిద్రమత్తే కారణమా అనే కోణంలోనూ సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారి-44పై కొంత సమయం పాటు ట్రాఫిక్‌ నిలిచిపోగా, పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు.

మరోవైపు ప్రమాద వార్త తెలిసిన వెంటనే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రి, సరోజిని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పిన చైర్మన్, బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణమే నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర చికిత్సలు సకాలంలో అందేలా చూస్తూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆయన వైద్యులను కోరారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor