తెలంగాణ · June 30, 2026

కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఎక్కడ?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హన్మకొండ/కమలాపూర్,వి90 న్యూస్,జూన్ 30: తెలంగాణలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక భరోసా కల్పించిన కల్యాణలక్ష్మి, గర్భిణీలకు అండగా నిలిచిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కమలాపూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తుంటే సంతోషమే కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆ చెక్కులతో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా రైతులకు మూడు విడతల రైతుబంధు ఇవ్వలేకపోయిందని, ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా పంపిణీలో యాప్ పేరుతో అమలు చేస్తున్న కొత్త విధానాలు రైతులకు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంత కీలకమో స్పష్టంగా కనిపిస్తోందని, కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, ప్రాజెక్టులను నింపితే రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తేవి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి విలువ ఇలాంటి కరువు సమయంలోనే ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరోసారి అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor