క్రైమ్ · June 30, 2026

వ్యాపారిని హత్య చేసి పూడ్చిపెట్టిన నిందితుల అరెస్ట్: షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి/షాద్‌నగర్,వి90 న్యూస్,జూన్ 30: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త మహ్మద్ హాజీ హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వ్యాపారిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు షాద్‌నగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) లక్ష్మీనారాయణ వెల్లడించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ సీతారాం ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త మహ్మద్ హాజీ (35) ఈ నెల 22వ తేదీన అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, విచారణలో భాగంగా బిజినపల్లి గ్రామానికి చెందిన పానుగంటి అరవింద్ జీ (36), వీరకారి శివాజీ (35)లను అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.భూవ్యాపార లావాదేవీలు, పాత ఆర్థిక విభేదాల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులిద్దరూ పథకం ప్రకారం మహ్మద్ హాజీని కారులో తీసుకెళ్లి హతమార్చారని ఏసీపీ తెలిపారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని షాద్‌నగర్ సమీపంలోని ట్రూ ల్యాండ్‌మార్క్–9ఈఎక్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలోని ఒక ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. జూన్ 29న నిందితులను పూర్తిస్థాయిలో విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని, వారిచ్చిన సమాచారం , సూచనల మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన మహ్మద్ హాజీ మృతదేహాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ హత్యకు ఉపయోగించిన కారుతో పాటు మూడు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, సిబ్బందిని షాద్‌నగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) ప్రత్యేకంగా అభినందించారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor