తెలంగాణ · June 30, 2026

30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా చేశాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూన్ 30:తెలంగాణ రాష్ట్రంలో రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగిన రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమంలో ఆయన ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తొలి విడత కింద రెండు ఎకరాల లోపు భూమి కలిగిన రాష్ట్రంలోని 41.37 లక్షల మంది నిరుపేద, చిన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలను నేరుగా (DBT) జమ చేసినట్లు వెల్లడించారు. 30 నెలల తమ ప్రజాపాలనలో రైతాంగం సమాజంలో గర్వంగా తలెత్తుకునేలా సంక్షేమ పాలన అందిస్తున్నామని, వ్యవసాయం దండగ కాదు.. ఒక పండుగ అనే నమ్మకాన్ని అన్నదాతల్లో కల్పిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారానే దాదాపు 36 వేల కోట్ల రూపాయలను రైతులకు అందించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.ఇదే వేదికగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి కేవలం 69 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే, 2023 నాటికి గత పాలకులు దాన్ని ఏకంగా 8.11 లక్షల కోట్లకు చేర్చారని మండిపడ్డారు. గత పదేళ్లలో సుమారు 7 లక్షల కోట్ల అప్పులు చేసి, దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అప్పులు, తప్పుల భారాన్ని ఇప్పుడు తమ ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, బకాయిలు పెట్టింది బకాసురుడు అయితే వాటిని తీర్చే పాపం తమకు చుట్టుకుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో జీతాలు ఇచ్చే దుస్థితి ఉండేదని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాష్ట్ర పరువు తీశారని దుయ్యబట్టారు. కానీ తమ ప్రజాప్రభుత్వంలో ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిపివేస్తారంటూ గతంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని, అయితే 2004లోనే దేశంలో రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. కేవలం రైతుల కోసమే తమ ప్రభుత్వం ప్రతి నెల సుమారు 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇందులో భాగంగా ఉచిత విద్యుత్ కోసం 30 వేల కోట్లు, రైతు బీమా కోసం 4 వేల కోట్లు, అలాగే రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం 80 వేల కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor