యాదగిరిగుట్టలో భూముల కేటాయింపునకు స్పష్టమైన విధానం రూపొందించండి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ,వి90న్యూస్ ,జూన్ 30: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు, సంస్థలకు భూముల కేటాయించడానికి సంబంధించి అత్యంత స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలపై ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గుట్ట పరిధిలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. కేటాయింపులు జరిగినప్పటికీ, ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు (Land Ownership Rights) ఎల్లప్పుడూ దేవస్థానం వద్దే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ (చారిటబుల్) ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారమే భూమిని కేటాయించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.యాదగిరిగుట్ట పైన భక్తుల వసతి కోసం అతిథి గృహాల (కాటేజీల) నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చే దాతల జాబితాను సిద్ధం చేయాలని, ఈ నిర్మాణాల అనుమతుల్లోనూ టీటీడీ తరహా విధానాన్ని అమలు చేస్తూ దశలవారీగా పర్మిషన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపైన కూడా పారదర్శక నిబంధనలు ఉండాలన్నారు. ఆలయ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణకు తక్షణమే నిధులను మంజూరు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణ లోపాలపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా పరిశీలించి వారం రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని చెప్పారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు దేవాదాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ పాల్గొన్నారు.

