తెలంగాణ · July 1, 2026

ఆదాయ సమీకరణే లక్ష్యం: లీకేజీల అరికట్టడానికి ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను పక్కాగా సాధించడానికి వీలుగా ఆదాయ సమీకరణపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదాయ పెంపునకు అడ్డుపడుతున్న లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమీక్షా సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ, టీజీఐఐసీ సంస్థల ఆదాయ సమీకరణపై ప్రత్యేక నిఘా పెట్టాలని, అలాగే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి ప్రధాన శాఖల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని తేల్చి చెప్పారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ఆయా శాఖలు తమ పనితీరును, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడానికి అనుగుణంగా శాఖలవారీగా బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్టుల పురోగతిలో భూసేకరణ ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఊహాజనితంగా ఉండకూడదని, అంతా వాస్తవికత ఆధారంగానే రూపకల్పన జరగాలని ఖరాఖండిగా చెప్పారు. లీకేజీలను అరికట్టి ఆదాయాన్ని పెంచే ప్రక్రియలో ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor