టెక్నాలజీ · July 1, 2026

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీని బట్టి వాటంతట అవే స్పందించేలా సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో అనలాగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ (MEIL) సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ప్రాథమిక అంగీకారం ప్రకారం, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దేశంలో ప్రవేశపెట్టనున్న ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ వ్యవస్థకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే పరస్పరం మార్చుకున్నాయి.ఈ సందర్భంగా అనలాగ్, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెన్స్ సదుపాయమైన ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ పనితీరుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సరికొత్త టెక్నాలజీ కేవలం ముందుగా రాసిపెట్టిన ప్రోగ్రామింగ్ ఆధారంగా కాకుండా, నిరంతర అభ్యాసం (స్వయంగా నేర్చుకోవడం) ద్వారా వాస్తవిక పరిస్థితులను గ్రహించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ సాంకేతికత ద్వారా నగరాలను ‘కాగ్నిటివ్ సిటీస్’గా మార్చవచ్చని, సెన్సర్లు, రోబోటిక్స్ సాయంతో కేవలం ట్రాఫిక్ రద్దీని నియంత్రించడమే కాకుండా.. రోడ్లపై లీకేజీలను ముందే గుర్తించడం, విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, అత్యవసర సమయాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు గ్రీన్ ఛానల్ (ఫ్రీ వే) కల్పించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సీఎం కోరారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor