తెలంగాణ · July 1, 2026

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 01: తెలంగాణవ్యాప్తంగా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు కురుస్తుండగా, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడం, గత నాలుగు రోజులుగా ఇవి తీవ్ర వేగం పుంజుకోవడం వల్ల రాబోయే 24 గంటల నుంచి 72 గంటల వ్యవధిలో తెలంగాణతో పాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. దీనికి తోడు ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని, వీటి ప్రభావంతో రుతుపవనాలు మరింత బలపడి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.జులై 1వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాల ఉధృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ముఖ్యంగా అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రత్యేకంగా పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు భారీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరించింది.ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ఎవరూ చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిలబడకుండా సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు పౌరులను అప్రమత్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor