పసుపు, కుంకుమలతో బొమ్మ ఆకారం, నిమ్మకాయలు.. భయాందోళనలో భక్తులు
అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తుల ఘాతుకం….దర్యాప్తు కోరుతున్న స్థానికులు, భక్తులు
వరంగల్,వి90 న్యూస్,జూలై 03: చారిత్రాత్మక వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఆలయ చెరువు పూడికతీత పనులు జరుగుతున్న ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉదయం స్థానికులు, భక్తులు గమనించే సరికి అక్కడ క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి.పూడికతీత జరిగిన స్థలంలో పసుపు, కుంకుమలతో ఒక భయంకరమైన బొమ్మ ఆకారాన్ని గీసి, దాని చుట్టూ నిమ్మకాయలను అమర్చినట్లు గుర్తించారు. ఎంతో పవిత్రమైన భద్రకాళి క్షేత్ర పరిధిలో ఇలాంటి అసాంఘిక, మూఢనమ్మకాలతో కూడిన చర్యలు జరగడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.ఈ ఘటనతో అమ్మవారి భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయాలని, రాత్రి వేళల్లో నిఘా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంతాన్ని అపవిత్రం చేసేలా ప్రవర్తించిన గుర్తుతెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై పోలీసులు, ఆలయ అధికారులు తక్షణమే స్పందించి దర్యాప్తు జరపాలని భక్తులు కోరుతున్నారు.

