కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 24: జమ్మికుంట పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిత యుగేందర్ – అనురాధ దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న వారి కుమార్తె, అల్లుడు గంది నిఖిల్ తేజ్ – నేత్రి దంపతులతో పాటు మనవళ్లు ఆరుష్, అనీష్‌లకు శ్రీ స్వామివారి సంపూర్ణ కృపాకటాక్షాలు లభించాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక అర్చనలు జరిపించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

పూజా కార్యక్రమాల అనంతరం, ఆలయ ప్రాంగణంలో దీక్షాధారులైన అయ్యప్ప స్వాములకు అత్యంత నిష్ఠతో భక్తిశ్రద్ధలతో ‘మహాభిక్ష’ ఏర్పాటు చేశారు. స్వాముల భజనలు, ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో మారుమోగింది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయిత మోహన్, దివ్యలతో పాటు స్థానిక ప్రముఖులు, భక్తులు , అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి విచ్చేసిన స్వాములందరికీ దంపతులు స్వయంగా భోజన ఏర్పాట్లను పర్యవేక్షించి, వారి ఆశీస్సులు అందుకున్నారు.

