కరీంనగర్/హుజూరాబాద్/వి90 న్యూస్/నవంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు శాశ్వత సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ మీడియం, స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే శాశ్వత వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు సమగ్ర పెన్షన్ విధానం లేకపోవడం ఆందోళనకరమని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే ప్రకటనల ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని జర్నలిస్టుల సంక్షేమ నిధికి కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 3 శాతం మ్యాచింగ్ గ్రాంట్ అందించాలని వారు కోరారు. ఈ నిధుల నిర్వహణకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఏర్పాటు చేసి, పారదర్శక పర్యవేక్షణతో పాటు ఏటా ఆడిట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులతో పాటు సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టులకు వర్తించేలా సమగ్ర పెన్షన్ పథకాన్ని రూపొందించాలని సూచించారు. ఇందుకోసం సీనియర్ సంపాదకులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని, అన్ని మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి ముఖ్యమంత్రి, సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–143 అధ్యక్షుడు గూడూరి కొండల్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామిని రవీందర్, సీనియర్ జర్నలిస్టులు పరంకుశం కిరణ్ కుమార్, సురకంటి తిరుపతిరెడ్డి, నంబి భరణి కుమార్, ఎం.డి. యూసుఫ్, గోపగోని మహేష్, సత్యరాజ్, శ్రీనివాస్, కుమార్, రాజు, సాగర్, వెంకటస్వామి, రజనీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

