కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 01: జమ్మికుంట పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాసం మూడవ మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి ఉదయం నుంచే భక్తులు విశేషంగా తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.కార్యక్రమంలో భాగంగా దేవాలయ ప్రధాన అర్చకులు డింగిరి హరికృష్ణమాచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి మూర్తిని సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మరియు దివ్యాంబరాలతో రమణీయంగా అలంకరించిన అర్చకులు, భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ పంచామృతాలతో మహాన్యాసపూర్వక అభిషేకం జరిపారు.అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన 1,116 నాగవల్లి (తమలపాకు) దళాలతో మహాపూజ, విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ నామస్మరణలు, జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు.

భక్తులంతా స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.ఇదే ప్రాంగణంలో శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు, సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పూజా మహోత్సవంలో స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

