తెలంగాణ · May 2, 2026

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సీసీ కెమెరాల నిఘా: ప్రారంభించిన మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్, మే 2: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భద్రతను పటిష్టం చేసే దిశగా కీలక అడుగు పడింది. మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవిలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, మార్కెట్ పరిధిలో నేరాల నియంత్రణకు , పారదర్శకతకు ఈ సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా మార్కెట్ పరిసరాల్లో మిర్చి తొడిమెలను తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితమై ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వ్యర్థాలను తరలించేందుకు అవసరమైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి డంపింగ్ యార్డులకు పంపిస్తామని స్పష్టం చేశారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతును రాజు చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏనుమాముల పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం మంజూరు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐనవోలు, ఎదర మండలాల్లో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉందని, అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా కొనుగోలు చేసిన పంటను వెంటనే సమీపంలోని గోదాములు, ఫంక్షన్ హాళ్లకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడినప్పటికీ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి కూలీలను సమన్వయం చేసుకుంటూ లోడింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , మార్కెట్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor