ఆంధ్ర ప్రదేశ్ · May 2, 2026

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

శ్రీ సత్యసాయి జిల్లా పరిగి,మే 2 : ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళ వంటివని, ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు. శనివారం పరిగి మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు రూ.3 కోట్ల నిధులతో పూర్తి చేసిన బీటీ రోడ్లను మంత్రి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, గతంలో తాను పర్యటించిన సమయంలో గ్రామస్తులు రహదారి సమస్యలను తన దృష్టికి తెచ్చారని, అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో ఆ పనులను నాణ్యతతో పూర్తి చేయించామని తెలిపారు. బీజీగాని పల్లిలో రూ.1.9 కోట్లు, తిరుమల దేవరపల్లికి రూ.1 కోటి, విట్టపల్లి గ్రామానికి రూ.26 లక్షల నిధులతో నూతన రహదారులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఈ రోడ్ల నిర్మాణంతో దశాబ్దాల కాలంగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కష్టాలు తీరాయని, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా సులభతరం అవుతుందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.పరిగి మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ప్రస్తుతం మండల వ్యాప్తంగా రూ.45 కోట్ల వ్యయంతో వివిధ పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల కోసం రూ.3 కోట్లతో బీసీ హాస్టల్ నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే మరో రూ.3 కోట్లతో ఎస్సీ హాస్టల్ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఊటుకూరులో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పీహెచ్సీ భవనం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కియా వంటి పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను జిల్లాకు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.అనంతరం వైసిపి నాయకుల తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తున్నా, వైసిపి నేతలు కళ్ళుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను, కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధికి అండగా నిలిచే వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor